May a good source be with you.

దివాలా చట్టం గుట్టు రట్టు చేస్తున్న ఆదానీ పవర్ ముంద్ర వ్యవాహారం

ప్రధాని మోడీ కి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు కలిగిన గౌతం ఆదానీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆర్బీఐ మార్గదర్శకాలను కూడా కాలదన్నుతోందా అన్న ప్రశ్న నేడు ఆర్థిక నిపుణులను ఆలోచింప చేస్తోంది.

ఆదానికి చెందిన అనుబంధ కంపెనీ ఆదానీ పవర్ ముంద్రా. దీని నెత్తిన 22 వేల కోట్ల ఋణభారంతో ఉన్నది. ఆ ఋణగ్రస్త కంపెనీని గుజరాత్ ప్రభుత్వానికి అంటగట్టటానికి పలు ప్రయత్నాలు జరిగాయి. ముంద్ర పవర్ కంపెనీ లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం ఆదానీ కంపెనీతో జరుగుతున్న చర్చలు చివరికి విఫలమయ్యాయి. దాంతో దివాళా పిటిషన్ వేయటం తప్ప కంపెనీ యాజమాన్యానికి మరో ప్రత్యామ్నాయం లేదు.

ఇదే సమయంలో ఆర్బీఐ దివాళా అంచున ఉన్న కంపెనీలను గుర్తించి వాటిని స్థిరీకరించేందుకు ఆగస్టు వరకు గడువు విధించింది. అలాంటి కంపెనీల జాబితాలో ఆదానీ పవర్ ముంద్ర కంపెనీ కూడా చేరింది. ఈ సమయంలో కంపెనీ యాజమాన్యం దివాళా చట్టం కింద నమోదు చేసుకోవటం అంటే మరో ఆర్నెల్ల పాటు బ్యాంకు రుణాలు వడ్డీలు చెల్లించకుండా ఉండేందుకు లైసెన్స్ పొందటమే అవుతుంది.అంటే ఆచరణలో దివాళా తీసిన కంపెనీ ఆస్తులు బాంకులు స్వాధీనం చేసుకోకుండా ఆర్నెల్ల పాటు చక్రం అడ్డేయటమే.

దివాళా చట్టంతో దేశంలో బడా కంపెనీల ముడ్డి కింద మూలుగుతున్న వేల కోట్ల ప్రజాధనం వెలికి తెస్తామని మోడీ ప్రభుత్యం వాగ్దానం చేసింది. ఈ వాగ్దానం నీటి మీద రాతే అని పలువురు ఆర్ధిక వేత్తలు విమర్శించారు. వారంతా దేశ ద్రోహుల జాబితాలో చేరిపోయారు.

ఆదానీ ముంద్ర పవర్ కంపెనీ వ్యవహారం పరిశీలిస్తే దివాళా చట్టం ఎవరి ప్రయోజనం కోసమో స్పష్టంగా అర్ధమవుతుంది. దివాళా చట్టం నీడన చేరటం అంటే కంపెనీల నష్టాలు కూడా ప్రజల నెత్తిన మోపటమే.

గతంలో ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణల్లో భాగంగా లాభాలు సంపాదించే ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రయివేటు వారికి అప్పగించి నష్టాలు వచ్చె కంపెనీలను ప్రభుత్వం నడపటానికి సిద్ధం కావటం ద్వారా లాభాలను ప్రయివేటికరించి నష్టాల భారాన్ని ఖజానా మీద రుద్దేవి. కానీ మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే నాలుగాకులు అదనంగా చదివింది. అందుకే ప్రయివేటు కంపెనీల నష్టాన్ని కూడా దివాళా చట్టం రూపంలో ప్రభుత్వ ఖజానా మీద తద్వారా ప్రజాలమీద మోపటానికి రంగం సిద్ధం చేసింది. అందలో భాగంగా వచ్చిందే దివాళా చట్టం.

ఈ చట్టం కింద బ్యాంకులకు బకాయి పడిన ఏ కంపెనీ అయినా నమోదు చేసుకుంటే ఆ కంపెనీని అమ్మటానికి కావల్సిన విధి విధానాలు ధరవరలు బ్యాంకు అధికారులు సదరు దివాళా తీసిన కంపెనీ ప్రతినిధులు ఉమ్మడిగా ‌ఖరారు చేయొచ్చు. ఆ పద్దతిలో ఎన్ని వాయిదాల్లో ఎంత‌మొత్తం‌ చెల్లించగలరో కంపెనీ విజ్ఞప్తి ని పరిశీలించి కంపెనీ లా బోర్డు అనుమతిస్తుంది.‌ ఆ‌ అవకాశాలు ‌కూడా సద్వినియోగం ‌చేసుకునే స్తితి లేకపోతే కంపెనీని మొత్తం విలువలో ఐదో వంతు వాటాకో పదోవంతు వాటాకో తెగనమ్మటానికి తీర్మానం చేయటం ఈ తాజా చట్టం కింద కంపెనీ‌ లా బోర్డు బాధ్యత.‌ తద్వారా పదివేల కోట్లు వసూలు కావల్సిన బకాయిలు ఉన్న కంపెనీని వెయ్యి కోట్లకో వంద కోట్లకో నికర రొక్కం ఇవ్వగలిగిన విదేశీ కంపెనీ కో స్వదేశీ కంపెనీకో విదేశాలలో బినామీ కంపెనీలు నడిపే స్వదేశీయులకో అప్పణంగా అమ్మొచ్చు. ఈ సూత్రం అదానీ పవర్ ముంద్ర విషయంలో ఎలా అమలు జరుగుతుందో జాగ్రత్తగా పరిశీలిస్తే ముక్కన వేలేసుకోవటం పాఠకుల వంతు అవుతుంది.

వార్తా కథనాల్లో ఉన్న సమాచారం ఇలా ఉంది.

ముంద్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రధానంగా దిగుమతి ఆధారిత బొగ్గు‌ ఇంధనంగా నడుస్తుంది. దీనికి గాను ఇండొనేషియా ప్రభుత్వంతో అదానీ కంపెనీ బొగ్గు కొనుగోలు ఒప్పందం‌ కుదుర్చుకున్నది. అయితే 2012లో ముంద్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సరఫరా చేసే బొగ్గు ధర విషయంలో ఇండొనీషియా ప్రభుత్వం నూతన విధానాన్ని పాటించనున్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయంగా బొగ్గు సరఫరా ధరల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ముంద్రకు సరఫరా అయ్యే బొగ్గు ధర నిర్ణయమవుతుంది.‌ ఈ సూత్రం ఆధారంగా అదానీ కంపెనీ బొగ్గు దిగుమతికి అనుకున్న‌దానికన్నా అధిక ధరలు చెల్లించాల్సి వచ్చింది.‌అంటే విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగింది. ఈ నష్టాలు తగ్గించుకోటానికి తొలుత అండర్ ఇన్ వాయిస్ పద్దతి అనుసరించింది. అంటే వంద టన్నుల బొగ్గు దిగుమతి చేసుకుని రికార్డుల్లో పాతిక టన్నులుగా చూపించి కేంద్ర ప్రభుతానికి పాతిక టన్నులకు మాత్రమే దిగుమతి సుంకం చెల్లించటం. ఈ విషయాన్ని ఎకనమిక్ అండ్‌ పొలిటికల్ వీక్లీ సంపాదకులుగా ఉన్న సీనియర్ జర్నలిస్ట్ పరంజొయ్ గుహ ఠాకుర్ దా‌ వెలుగులోకి తెచ్చారు. ఆయన్ను ఆ పదవి నుండి రాజీనామా చేసేలా మోడీ‌ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది.

ఇదిలా ముంద్ర కంపెనీతో గుజరాత్ ప్రభుత్వం మోడీ హయాంలో నే విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నది. పెరిగిన విద్యుత్ ఉత్పత్తి ఖర్చుకు అనుగుణంగా వినియోగదారులకు సరఫరా చేసే విద్యుత్ చార్జీలు పెంచాలని ముంద్ర పవర్ కంపెనీ కేంద్ర ‌విద్యుత్‌ నియంత్రణాధికార సంస్థను కోరింది.‌ మోడీ గారి ప్రియ శిష్యుడు పియూష్ గోయెల్ విద్యుత్తు శాఖా మంత్రిగా ఉన్న సమయంలో ఆ రెగ్యులేటరీ కమీషన్ ముంద్ర కంపెనీ కోరిక మన్నించి పెరిగిన భారాన్ని మోపటానికి అనుమతించింది. దురదృష్టవశాత్తూ ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది.‌ ఫలితంగా గత సంవత్సరం ‌ముంద్ర పవర్ కంపెనీ కి 4300 కోట్లు నష్టం వచ్చింది.

ఈ కంపెనీ స్థాపించటానికి గౌతం‌ అదానీ పలు బ్యాంకుల వద్ద ఆరువేల కోట్ల రుణాలు తీసుకున్నాడు.‌ నాలుగైదు సంవత్సరాల పాటు కంపెనీని నడిపిన తర్వాత కేవలం‌ నూట ఆరు కోట్ల కు తెగనమ్మాలని అదానీ బోర్డ్ నిర్ణయించింది. విశేషమేమిటంటే మొత్తం‌ గౌతం అదానీకి ఉన్న యాభై వేల కోట్ల‌ అప్పు లో ఈ కంపెనీ పేరు మీదనే 22 వేల కోట్ల అప్పు ఉంది. ఆరు వేల కోట్ల వ్యవస్థాపక ఖర్చు ఉన్న కంపెనీకి అంతకు మూడున్నర రెట్లకు పైగా అప్పు ఇవ్వడం ఏంటో ఇచ్చిన బ్యాంకులకు ఆర్బీఐకి మాత్రమే తెలియాలి. పరిశీలకుల అభిప్రాయంలో విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీగా ఉనికిలోకి వచ్చిన ఈ కంపెనీ కాలక్రమంలో అదానీకి చెందిన అనేక ఇతర కంపెనీలకు పెట్టుబడులు మళ్ళించే షెల్ కంపెనీగా మారినపుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. దీనికి గాను కంపెనీ చట్టంలో పెట్టిన ముద్దు పేరు అస్సేట్ ట్రాన్స్ ఫర్.‌అంటే లాభాసాటి వ్యాపారం చేయటం ద్వారా బ్యాంకులకు బకాయిలు చెల్లించగల స్థోమత పెరుగుతుంది అని నమ్మించి ఒకే కంపెనీ పేరుతో రుణాలు తీసుకుని పలు వ్యాపారాలు చేయటమన్నమాట.‌

ఈ సమయంలో ముంద్ర‌ పవర్ ‌కంపెనీని దివాళా తీసిన కంపెనీ గా ప్రకటించటం ద్వారా గౌతం అదానీ తన నెత్తిన ఉన్న అప్పులో సగానికి సగం‌ ఎగ్గొట్టటానికి రంగం సిద్ధం అయ్యింది. ‌

సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అదానీ తన ఈ తెల్ల ఏనుగుకి మేత పెట్టలేక గుజరాత్ ప్రభుత్వానికి అంటగట్టేందుకు ప్రయత్నం చేసింది.‌ ఆ మేరకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.‌ దీంతో దిక్కుతోచని అదానీ దివాళా చట్టం కింద రక్షణ పొందటానికి సిద్ధమయ్యారు.‌ ఆ విధంగా దివాళా చట్టం చివరకు నష్టాలబారిన పడిన మరిన్ని బ్యాంకులను మరింత నష్టాల పాల్జేసే వింత చట్టం.‌ ప్రయివేటు కంపెనీల‌‌ నష్టాలను బ్యాంకు రుణాల రద్దు‌ రూపంలో తిరిగి ప్రజలపై మోపే మహత్తర చట్టమే‌ దివాళా చట్టం అని అదానీ పవర్ ముంద్రా వ్యవహారం పరిశీలిస్తే అర్ధమవుతుంది. క్రోనీ కాపిటలిజానికి ఇంతకన్నా పెద్ద నమూనా లేదు.‌ మోడీ అవినీతి పై పోరాటం నీటిమీది రాతే అని చెప్పటానికి అదానీని మించిన ఉదాహరణ లేదు.‌

Support NewsCentral24x7 and help it hold the people in power accountable.
अब आप न्यूज़ सेंट्रल 24x7 को हिंदी में पढ़ सकते हैं।यहाँ क्लिक करें
+